Saturday, December 22, 2012

క్లోను


వుండరెవరూ
నీతి వాక్యాల ఆప్తులెవరూ సమీపించరు
అపరిచిత ముఖాల పాత మిత్రులు  నన్ను పోల్చుకోరు
గొడవ పడేందుకు శత్రువులకు ఆనను
నగరంలో తిరుగుతున్న వొంటరి మనిషి కూడా తప్పుకొంటాడు
ప్రియురాలికింక రుచించను ఆయుధం నన్ను ధరించదు
నడిచే నీడ కూడా అదృశ్యమవుతుంది
దైర్యం చెప్పే చేతి స్పర్శ దూరాన నిల్చిపోతుంది
కవిత్వంలోకి కృంగిపోయే క్షణాలు కూడా యింకిపోతాయి
----------------------------------------------------------

సెవెరినో ఆంటినోరి సాయంతో నన్ను నేను సృష్టించుకొంటాను
నాతో నేను తల బాదు కుంటాను
నాతో నేను చెవి వొగ్గుతాను

నాతో నేను కత్తులు దూస్తాను
నాతో నేను పడుకుంటాను
నాతో నేను వున్మత్త ప్రేలాపిస్తాను
----------------------------------------------------

హఠాత్తుగా నేనుల మధ్య యుద్ధం రాజుకొంటుంది 
నన్ను నేను పట్టుకోవడానికి పొంచి వుంటాను
నాపై నేను మృత్యువును కుమ్మరించుకొంటాను
దట్టమైన పొగమంచులోంచి విచ్చుకొంటున్న అసంఖ్యాక నేనులు
చిందిన ప్రతి రక్తపు బొట్టులోంచి  లేస్తున్న వేనవేల నేనులు
పగిలిన అద్దాల వలె యెటు చూస్తే అటు నేను
బిత్తరపోతాను
యేది  నేను? యేది క్లోను?