Monday, December 12, 2011

వొక వూహ

నేను నడుస్తుంటాను 
గమ్యం లేని గమనం 
మృత్యువొక్కటే నీడలా వెంబడిస్తుంది 
వొక మహా నాగరికతకు ఆవల పురాతన 
కాలం మీద నడక సాగుతుంది 
చూచినంత మేరా-భూమీ,ఆకాశమూ
బట్టలతో పాటు జ్ఞాపకాల్నీ విసర్జించి 
నగ్న మనో దేహాలతో సంచరిస్తాను 
సమస్త ప్రకృతి తన పూల పరిమళంతో 
నన్ను మోహిస్తుంది 
నేను నడుస్తుంటాను 
వేల వేల యేళ్ళ వెనక్కి.. 




                                                               -----తెల్లవారు ఝాము ౩.౦౦ 
                                                                      12-12-2011

Wednesday, December 7, 2011

సముద్రుడు

మన బోధకుడు ...



అతడొక ఆయుధం
రక్తం మరిగే శక్తి
మానవ జాతి కనురెప్పల మీద 
మొగ్గ తొడిగిన ఎర్రటి స్వప్నం 
ఈ భూమి మీద నడుస్తున్న జీవితం
అవును! అతడొక యుద్ధం 
ఊగిసలాడుతున్న లోలకాల మధ్య 
ఒక నిశ్చల ప్రశ్నార్ధకం 
స్వప్నాలు పూరేకులై  రాలిపోతున్న 
ఈ నేలలో
స్వప్న సృష్టి కోసం అవిరామంగా పోరాడుతున్న నిషిద్ధ యోధుడు 
అతడు క్రియాశీలి 
కల్లోలిత మానవ జాతి నాలుగు రోడ్ల కూడలిలో
హాహాకారాలు చేస్తున్న వేళ
అతడు బుల్లెట్లై వర్షించాడు 
నిర్వీర్య జన స్తబ్దతలోకి
లోహ మంటల్ని వెదజల్లాడు 
అతడు ప్రేమికుడు
రాలిపోయిన మొగ్గల్ని 
ఒడిలోకి తీసుకుని కన్నీరై 
కరువు నేలలోకి దాహమై జలజల లాడుతాడు
జీవితాన్ని దోసిలినిండా ఒడిసిపట్టి 
ప్రజల పై అభిషేకిస్తాడు 
అతడు స్వాప్నికుడు
లోహ భుజంగాల్ని భుజం పై మోస్తూ
కలల రాజ్యంలోకి పొగరేగి పోతాడు 
ప్రతి రాత్రీ  భవిష్యత్తులోకి 
నిదుర మేల్కొంటాడు 
ఎప్పుడూ పరిమళాలు నింపుకొన్న కళ్ళతో 
ఆకాశం కేసి చూసేవాడు 
అతడు కవి 
దగ్దాశ్రువుల్నిఅక్షరాలు చేయడమెలాగో తెలుసు 
హుంకరిస్తున్న కసిని
సిరాలోకి వంపడమెలాగో   తెల్సు 
తుపాకిని గూర్చి రాయడమెలాగో 
అతని కొక్కడికే  తెలుసు 
చావును గోడకు దిగ్గొట్టగల  ధీశాలి
అంతిమ క్షణంలో కూడా యుద్ధ గీతి ఆలపించగలడు
శరీరంలో మండుతున్న తూటాకు దీటుగా
స్పందించగలడు 
అతడు ద్వేషి 
పుట్టుకతో శత్రువును గుర్తు పట్టిన వాడు 
మరణ శయ్య పై  'ఒరే శత్రువా ' అని
సంబోధించిన వాడు 
అతడు ఉపాధ్యాయుడు 
నేర్వడమంటే  జీవించడమని నేర్పిన వాడు 
చనిపోతూ ఎ.కె. 47  మీద 
సంతకం చేసి మనకిచ్చి వెళ్ళిన 
మన బోధకుడు 


..........................................దాము (ప్రవాహగానం నుండి)











Thursday, November 17, 2011

నా రాత్రి ....

                                       యీ తాత్విక రాత్రిని కౌగిలించుకుంటాను.........






యీ  రాత్రి ...
యుగాలుగా నన్ను మోస్తున్న ....నేను మోస్తున్న 
యీ  రాత్రి ...
అనేకానేక పునర్జన్మల చీకటిని
నామీదికి కుమ్మరిస్తున్న యీ  రాత్రి
నా ప్రియురాళ్లను నాకందించి ...నా నుంచి 
లాగేసుకుంటున్న యీ మార్మిక రాత్రి.
అసంఖ్యాక వూపిరుల  వెచ్చదనాన్ని 
నా దేహానికి తాకించి ...నన్ను మళ్ళీ
వొంటరి ఖాళీ తనపు  దేహపు ప్రతిధ్వనికి
గురి చేస్తున్న యీ మాయావి రాత్రి.
కనులు తెరిచినపుడు అంధత్వాన్ని  
కనులు మూసినపుడు చూపునూ
ప్రసాదిస్తున్న వొక అజ్ఞాత తల్లి వంటి యీ రాత్రి ...
నాతో నేను  మాత్రమే మిగిలే అంతిమ రహస్యాన్ని
నాకెప్పటికీ నోరు విప్పని ఈ గుప్తపు రాత్రి...
నాలోకి తనూ....తనలోకి నేనూ ద్రవిస్తున్నపుడు...
తన పెదాల గుసగుసల్ని నాకు వినిపించనివ్వని 
ఈ దుఖపు రాత్రి
నా ప్రియురాలి కన్నీరు నా కనురెప్పలపై 
కురిసినపుడు నను వోదార్చని యీ నిర్దయ 
రాత్రి...
బ్రతికి వున్నపుడే  మృత్యు రహస్యానుభవాన్ని 
నాకందిన్చినందుకు  ....యీ తాత్విక రాత్రిని
కౌగిలించుకుంటాను .. 
                                                          .........రాత్రి 1.30      o6/10/2011   

Saturday, November 12, 2011

గాయం

























దేశభక్తి  వంటి వుపద్రవం ప్రబలిన కాలంలో
ప్రజలు లేని భూమి కోసం
సైనికులు మృత స్వప్నాలు కంటున్నపుడు
అతడూ నేనూ ప్రేమించుకున్నాం


నా దేహం మీద అతడు రాసాడు
           నక్షత్ర ఖచిత ఆకాశం
           మంచుతో తడిసిన పూలు
           ఎగరేసిన ప్రమాదసూచిక
అతడి నగ్నత్వం మీద నా పెదాలతో గుసగుస లాడను
           భయవిహ్వాలుడొకడు పరిగెత్తిన దారి
           అడవిలో ఒంటరిగా మండుతోన్న చెట్టు
           మగతగా కళ్ళు మూసుకొన్న పాము
                        
బిడ్డల్ని పంపి శవాల్ని తెచ్చుకుంటున్న
మాతృ ప్రేమ వంటి వొక మహా వున్మాదం
మాకు యెడబాటు కల్గించింది
         
          యెవరి లోపల వాళ్ళం గింజుకున్నాం


ప్రియతమా!


         ఆయుధాలు మాత్రమే పండే నేల మిగిలాక
         యెవరి దేశంలో వాళ్ళు కాందిశీకులు
         కన్నెపిల్లలు వీరపత్నులవడం కోసం
          కలలు కంటున్నపుడు
  ప్రేమించడం వొక దేశద్రోహం
.............................................
     
           మేమిద్దరం ఇపుడొక జానపద గాధ




                                                                                 రచన---కార్గిల్ కాలం (1999)

Wednesday, November 2, 2011

pravaahagaanam


నేను ఒక కల కంటుంటాను ......కొద్దిసేపటి తర్వాత మెలకువ వస్తుంది.
చుట్టూ వున్నా పారదర్సక జీవితాన్ని తడుముతుంటాను. మళ్ళీ నిద్ర, కల కొనసాగుతుంది. అయితే అది సీక్వెన్స్ వుండదు. అన్నిసార్లు.........
                        సరిగ్గా నా కవిత్వము అంతే.
                                                                 ------దాము 



నాతోరా

నాతోరా .....................





నీ జాలి కన్నీటి బొట్లు నాకొద్దు
నీ వేడి నిట్టూర్పులు నాకొద్దు
నా రైలు పరుగెడుతుంటే 
స్టేషన్లో నించొని చేయి వూపద్దు
నా భుజం మీద చేయి వేయగల్గితే వేయి 
నా కంపార్ట్ మెంట్లో కూర్చోగల్గితే  కూర్చో
లేదూ - నాకు నీ వీపు చూపించి
పిరికి పాదరక్షలేసుక పరిగెత్తు 

..............................................18-01-1988  


Monday, October 31, 2011

వై?

 















యెందుకని?
    దుక్ఖిత స్వప్నమే వెంటాడుతోంది?
    వొంటరి దేహమే ప్రతిధ్వనిస్తోంది?                        
     కాలం తలక్రిందులుగా నడుస్తోంది?

     యెవరైనా నా లోపలికి చొరబడి
     నన్ను మోసుకెల్లరూ?

Wednesday, October 26, 2011

మా వొక దేహం















Im a dead end 2 u
fnd another rd 2 walk on

-అని మెసేజ్ యిచ్చాను ఆమెకు 
 ఆమె వొక పురాతన కాలం నుంచి నన్ను వెంబడిస్తూ వుంది. నన్ను నేనే భారమని యెంచే లోన్లీ మ్యాన్ నేను
నన్ను లోకం మీదికి దొర్లిస్తున్న యీ కన్నతల్లిని యెలా వదిలించుకోను? 
వొక అంతర అంగమై ఆమె నా లోపలి గ్రహం లోకి ప్రవేశించింది

            విముక్తి లేదు మా వొకరి నుంచి వొకరికి 

నిజాల వలె తోచే అనేకానేక భ్రమలకావల మెరిసే ఆకాశం వంటి శూన్య దేహంతో ఆమె నన్ను మోహించింది
ఆమె మృత్యువని తెలుసు. బహుశా నేను జీవితం కానని నాకు  తెలియదు

అనేక చోట్ల యేక కాలంలో మరణించిన నేను ఆమె దేహం మీద మాత్రమే పువ్వు వలె విచ్చుకొంటాను

మా రెండు దేహాలూ శాపగ్రస్త మృత్యు శిలల వలె కాలాన్ని ధిక్కరించి అనంతంలోకి కూరుకుపోతాయి

నిద్రించాక మేలుకోవాలని మాకెవరూ చెప్పలేదు

                                                                                                                 --రాత్రి 11
                                                                                                                    sep 2011


Sunday, October 23, 2011

క్లోను



















వుండరెవరూ
నీతి వాక్యాల ఆప్తులెవరూ సమీపించరు
అపరిచిత ముఖాల పాత మిత్రులు నన్ను పోల్చుకోరు
గొడవ పడేందుకు శత్రువులకు నేను ఆనను   
నగరంలో తిరుగుతున్న వొంటరి మనిషి కూడా తప్పుకుంటాడు
ప్రియురాలికింక రుచించను; ఆయుధం నన్ను ధరించదు 
నడిచే నీడ కూడా అదృశ్యమవుతుంది
దైర్యం చెప్పే చేతి స్పర్శ దూరాన నిలచిపోతుంది
కవిత్వంలోకి క్రుంగిపోయే క్షణాలు కూడా ఇంకిపోతాయి
..............................................................
సేవేరినో ఆన్తినోరి సాయంతో నన్ను నేను సృష్టించు కొంటాను
నాతో నేను తల బాదుకొంటాను 
నాతో నేను చెవి వొగ్గుతాను
నాతో నేను కత్తులు దూస్తాను
నాతో నేను పడుకొంటాను
నాతో నేను ఉన్మత్త  ప్రేలాపిస్తాను 
.................................................
హఠాత్తుగా నేనుల మధ్య యుద్ధం మొదలవుతుంది
నన్ను నేను పట్టుకోవటానికి పొంచి వుంటాను
నాపై నేను మృత్యువును కుమ్మరించుకుంటాను
దట్టమైన పొగ మంచులోంచి విచ్చుకుంటున్న అసంఖ్యాక నేనులు
చిందిన ప్రతి రక్తపు బొట్టులోంచి లేస్తున్న వేనవేల నేనులు
పగిలిన అద్దంలా ఎటు చూస్తే అటు నేను 
దిగ్భ్రాంతి చెందుతాను 
యేది నేను? యేది క్లోను?  

                                                                                 --మార్చి ౩౦, 2003 
 
  

Saturday, October 22, 2011

వొక ధ్వని

ఇసుక కరుగుతుంది
పాద ముద్రలు చెదురుతాయి 
గతాన్ని వెంట తీసుకుని
వృత్తంలో నడుస్తావు 
సమూహాలు లేని వొంటరి కాలం 
నీ లోపలి నుంచి లోపలికి
ద్రవిస్తుంటుంది 
నీకు నువ్వు మిగులుతావు
క్రమ్ముకునే శూన్యమయినా
మెరిసే చిరునవ్వు జ్ఞాపకమయినా 
 నీకు నువ్వు దొరుకుతావు 
వంద గొంతుల సెల్ ఫోన్
సంభాషణల తర్వాత 
నీ రహస్య గొంతు
 నీకు మాత్రమే వినిపిస్తుంది.
                                                                                    ---11.06.2007


 


Thursday, October 20, 2011

పేరులేనితనం

జీవితం నిండా పేరులేనితనం...
భోరున దుఖాన్ని రాయలేని తనం 
రెండుగా చీలిపోయే అస్తిత్వాన్ని అనువదించలేని తనం
ఇనుప స్తంభంలా వికసించని ప్రేమ రాహిత్యం
పశువులు తొక్కిన పిల్లన గ్రోవి లాంటి హృదయాన్ని 
ఎక్కడో దారబోసుకుంటాను
శాపం లాంటి యవ్వనం లోంచి బాల్యంలోకి 
విముక్తి  కోసం  ఆకాశం  క్రింద అలమటిస్తాను
ఆకలిగొన్న  జంతువులాంటి దేహాన్ని యే
గుహలోకి తరమాలి ?
.....................................

ఎప్పుడూ రెండు ప్రపంచాల మధ్య ఘర్షణ 
విప్లవానికీ ప్రేమకూ  మధ్య 
ఉనికికీ స్వప్నానికీ
ఆలోచనకూ ఆచరణకూ
ఎప్పుడూ రెండు కోర్కెల మధ్య ఊగిసలాట 
కలకూ నిజానికీ 
గాలిలోకి లేచే భావ చిత్రాలకూ  భూమిలోకి కృ౦గే 
నిర్లజ్జ వ్యమోహాలకూ
....................................

చెప్పలేని తనం
బిగ్గరగా అరచి ప్రకటించలేని తనం
ఓస్! గట్టిగా ఏడ్వ లేని  తనం 
బిగ్గరగా హత్తుకోలేను 
నడి వీధిలో ఆకళ్ళలోకి చూస్తూ పరవశి౦చ లేను
ఒకే ఒక్క క్షణం ఆయుధం లేకుండా చిర్నవ్వలేను
ఒక్క రోజు చలించకుండా  నడవలేను
పలవరింత లేని నిద్ర రాదెన్నటికీ 
.......................................

ప్రేమలేని తనం
ఆకాశం నుంచి కురుస్తున్న  అశ్లీల వాల్ పోస్టర్ల కుండపోతలో 
తడిసాక 
దేహాన్ని తప్ప దేన్నీ చూడలేనితనం
.....................

సరుకులై మెరిసే నక్షత్రాలకవతల ఆకాశమొకటుందని
జ్ఞాపకం లేని తనం
రెండు రూపాయి నోట్లు ముద్దిడుకున్నపుడు  తప్ప
పులకరించలేనితనం
..............................

ఉండలేనితనం
ఒక చోటే పహారా కాయలేని తనం
నిరంతర పరకాయ ప్రవేశం
జీవితం నిండా పేరు లేనితనం

రాత్రి 8.30 19-08-1994)  

(ప్రవాహగానం  నుండి )






Sunday, October 16, 2011

నిల్ బాలన్స్

జీర్ణ పర్ణ శాల వేపుగా గొడుగు పట్టుకుని ఎవరు వచ్చేటట్లు లేదు ...
కాలం ఎడారిలో జ్ఞాపకం 
ఒంటె నడిచిపోయిన  గుర్తులు మినహా
ఏమీ మిగిలేటట్లు లేదు
ఎవరూ  వచ్చేటట్లు లేదు 
ఏమీ జరిగేటట్లు లేదు 
అమెజాన్ నదిలా వంకర్లు తిరిగిన ఆలోచన 
ఏ నాగరికతనూ ఆహ్వానించేటట్లు లేదు 
రాయలసీమ నెర్రెలు వారిన భూమి మీద
ఏ వర్షం కురిసేటట్లు లేదు 
చూచినంత మేర డ్రైలాండ్  విస్తీర్ణపు దుమ్ము 
ఇప్పట్లో   మణిగేటట్లు లేదు 
ఎవరూ వచ్చేటట్లు లేదు
ఏమీ జరిగేటట్లు లేదు
అమనిషత్వపు ఆకాశం నుంచి 
అబద్ధాల కుండపోత వర్షంలో 
తడుస్తున్న ఈ జీర్ణ పర్ణశాల వేపుగా 
గొడుగు పట్టుకుని ఎవరు వచ్చేటట్లు లేదు
తడి తగిలేటట్లు లేదు 
ఏమీ జరిగే జరిగేటట్లు లేదు 

("ప్రవాహ గానం" నుండి )