Friday, June 28, 2013

వొక సెల్ ఫోన్ శృంగారం తర్వాత....


మన చూడని తెరచుకొన్న కనుల మధ్య చూపులు లేని గోడ. 
స్థలాలు లేని దగ్గరితనంలోకి మనం నిరంతరం మ్రోగుతుంటాం కదా. 
నువ్వు గుంపుల్లోంచి నా దగ్గరికి యెగురుతావు. నేను కూడా.
నీ పెదాల తడి శబ్దమై నా లోకి దిగుతుంటుంది.
నా పదాలు పదాలు చినుకులై నిన్ను తడిపేస్తాయి లోపల.
నువ్వు కరిగి కరిగి కాలంలోకి నా వైపు ప్రవహిస్తావు.
నా గది మైనపు ముద్దలా కాలుతుంటుంది.
వొకో అక్షరం దేహ కణమై లోకి కణ కణ మంటూంటుంది.
మన వూహలు పెనవేసుకుంటాయా-
రహస్య సొరంగపు చీకటి వొకటి దేహాతీత దేహాత్త్మల అంగమై మొలుస్తుంది కదా.
నన్ను నేను వుసిగొల్పుతాను. నువ్వు కూడా.
                         .......

చూపుల స్పర్శ లేదు.
వూపిరి వేడి లేదు.
ముద్దుల మంత్ర ముగ్ధత లేదు.
దేహాల నృత్యమునూ లేదు.
కురిసిన వర్షంలో మెరిసిన అగ్ని చల్లారాక-
చార్జింగ్ అయిపోయిన డెడ్ సెల్ ఫోన్లలా
భూగోళానికి అటూ యిటూ మన రెండు దేహాలు.
యిద్దరి వొంటరి శూన్యం ఢీకొన్న చప్పుడు కూడా వినపడదు కదా. 

                                                                                                27. 06. 2013.
                                                                                                రాత్రి 12. 30.

Saturday, December 22, 2012

క్లోను


వుండరెవరూ
నీతి వాక్యాల ఆప్తులెవరూ సమీపించరు
అపరిచిత ముఖాల పాత మిత్రులు  నన్ను పోల్చుకోరు
గొడవ పడేందుకు శత్రువులకు ఆనను
నగరంలో తిరుగుతున్న వొంటరి మనిషి కూడా తప్పుకొంటాడు
ప్రియురాలికింక రుచించను ఆయుధం నన్ను ధరించదు
నడిచే నీడ కూడా అదృశ్యమవుతుంది
దైర్యం చెప్పే చేతి స్పర్శ దూరాన నిల్చిపోతుంది
కవిత్వంలోకి కృంగిపోయే క్షణాలు కూడా యింకిపోతాయి
----------------------------------------------------------

సెవెరినో ఆంటినోరి సాయంతో నన్ను నేను సృష్టించుకొంటాను
నాతో నేను తల బాదు కుంటాను
నాతో నేను చెవి వొగ్గుతాను

నాతో నేను కత్తులు దూస్తాను
నాతో నేను పడుకుంటాను
నాతో నేను వున్మత్త ప్రేలాపిస్తాను
----------------------------------------------------

హఠాత్తుగా నేనుల మధ్య యుద్ధం రాజుకొంటుంది 
నన్ను నేను పట్టుకోవడానికి పొంచి వుంటాను
నాపై నేను మృత్యువును కుమ్మరించుకొంటాను
దట్టమైన పొగమంచులోంచి విచ్చుకొంటున్న అసంఖ్యాక నేనులు
చిందిన ప్రతి రక్తపు బొట్టులోంచి  లేస్తున్న వేనవేల నేనులు
పగిలిన అద్దాల వలె యెటు చూస్తే అటు నేను
బిత్తరపోతాను
యేది  నేను? యేది క్లోను?   

Friday, November 2, 2012

తాత్వికుడు


కొత్త దు:ఖంతో, కొత్త నిశ్శబ్దంతో 
ఒక అపరిచితుడు నాలోకి ప్రవేశిస్తాడు 
ప్రేమలోంచి వొక దూరం దగ్గరై నాలోకి 
హత్తుకుంటుంది 
వొక రెండవ వాడు నాలోంచి బయటి 
వర్షంలోకి దూకుతాడు 
నా పాత జ్ఞాపకాలూ ,శిక్షిత ఆలోచన్లూ
పదదళంలా వాడిని వెంబడిస్తాయ్ 

నా అపరిచితుడే నేనయ్ 
కాలాన్ని అధిరోహిస్తాను 
గాలికన్నా వేగంగా పరుగులెత్తే నామీద 
అనేక వలలు ముసురుకొంటాయ్ 
ఉత్తరం వేపునుంచి వొక బాణం విసురుగా 
గుండెల్లోకి దిగుతుంది 
టీవీ న్యూస్ లో నా శవపు పెదాల మీది 
చిరునవ్వు మాత్రం అందరినీ దిగ్భ్రాంతి 
పరుస్తుంది 
....................................................31/08/2010 9.38 am (home)

Wednesday, August 22, 2012

పురుగులు

మృత్యువు వంటి రహస్యమేదో 
కమ్మినపుడు
నేను జీవిస్తాను
నిగూఢ గాడాంధకారపు కౌగిలిలో 
మేలుకొంటాను
స్వీయ దేహాన్ని వొరసుకుంటూ 
ప్రవహిస్తాను 
హఠాత్తుగా యెవరో  నా లోపలి 
నుంచి దూసుకెల్లిపోతారు
ఖాళీతనపు నైరాశ్యంతో 
రోజుల వెంట నడుస్తాను 
నేను మోస్తున్న దేహం నాదేనని 
తెలుసుకునేందుకు బద్దకిస్తాను 
వొకానొక చాలా కాలం తర్వాత 
గుర్తు తెలియని నా శవం 
యెవరికో దొరుకుతుంది 
    
శవాన్ని వదలి జ్ఞాపకాల్ని 
తింటుంటాయ్  పురుగులు  


   

Thursday, July 12, 2012

వొక ఖైదీ ప్రార్థన




ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడైన గొప్ప దేవా
నీ నామమును భయ భక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుడైన నా మొరను
చెవి యొగ్గి  వినుము ఖిన్నుడనై వున్న నా యీ ప్రార్ధన నాలకింపుము

నేల మాళిగ వంటి  వొక చెరసాలలో నా ప్రాణము బొందిలో నిమ్మళము లేక యున్న సంగతి నీకు నివేదింతును

మందలో  కలవలేని అశక్త  గొర్రెను. యెప్పుడూ నా నుంచి  నేను తప్పిపోతాను.  జీవితాన్ని  జైలును  చేసిన యెహోవా, జానెడు నేల కోసం, దోసెడు నీటి కోసం బంధింప పడ్డాను. నిన్ను శిలువ వేసిన వారి వారసులతో దేవా నేను మోదుకొంటినని నాకేమెరుక. మట్టికీ బతుకుకూ పేగు సంబంధాన్ని ముడిపెట్టితిననుకుంటిని. కానీ బంధనము బహుమానమగునని తలంచలేదు. నీ వాక్కుననుసరించి  నా పొరుగు వారిని ధృడముగ ప్రేమించుటయే నేను చేసిన నేరము. యెహోవా, అబద్ధములాడు కాలము నుండి, మోసకరమైన ప్రతి కొత్త  వుదయము నుండి నన్ను విడిపింపుము. నీవు నీ జ్ఞానము చేత సృజియించిన భూమ్యాకాశములు నీవు సృజియించిన పాపులమైన మాకు చెందునట్లు చేయుము. పగలు యెండ దెబ్బ నుంచి, రాత్రి వెన్నెల దెబ్బ నుంచి కాపాడుతున్న దేవా, నా రాకపోకలందు వూపిరులొదులుతున్న వొక మహా యుద్దము నుండి నన్ను కాపాడుము. నిర్మిమిత్తముగ నన్ను ద్వేషించుచున్న యేలినవారిని కన్ను గీటనియ్యకుము.

అహంకారులైన దొరలు మా మీదికి లేచినపుడు మా చేతికొక ఆయుధమైనా నొసంగని వో దేవా నీ తల్లి వంటి నా తల్లి కన్యకయని అవహేళననొంది ఆత్మహత్యింపబడినది. ఆమె స్మృతులొరసుకొని నేనిక్కడ నది వొడ్డువలె కరగిపోవుచుంటిని. నా చీకటి ముఖమును కప్పుకొనుటకిక్కడ వొక నక్షత్రముయునూ లేదు. మంద నుండి నన్ను రక్షించుటకై  యేకాంతమనెడి చల్లటి హస్తమును నా తలమీదుంచుము. వెంటాడుతున్న అపరిచిత ముఖము వంటి దుఃఖము నుండి నన్ను వుపశమింపచేయుము. నల్లని ద్రాక్ష గుత్తుల వంటి నా ప్రియురాలి రొమ్ముల రుచుల వంటి జ్ఞాపకములు నన్నిక్కడ వెంటబడి తరుముచున్నవి. నువ్వు  పాయలుగా చీల్చిన యెర్ర సముద్రము అలలెత్తి  నాలో ఘోషించుచున్నది. రాత్రి కురియు మంచుకు తడిచిన నా ప్రియురాలి నగ్న శరీర సౌందర్యము వంటి రహస్యమేదో  నా చెవిలో హోరెత్తుతున్నది. ఆకాశమందు ఆసీనుడైన వాడా యెహోవా నీవు నీ గుప్పిలిని విప్పి పిడికెడు నక్షత్రములు నా నెత్తిమీదికి రాల్చి నన్ను ధన్యతనొందింపుము. నాకు నా ప్రియురాలి బలసూచకమైన మందహాసము నిమ్ము. ఆమె ప్రేమాతిశయ స్వరమును వినిపింపనిమ్ము.

గ్రీష్మము దాటిపోయెను. వర్షాకాలముయునూ  గతించుచున్నది. దేశమంతా పువ్వులు పూసియున్నవట. సౌందర్యము విచ్చుకొనుచున్నదట. దర్శన భాగ్యము లేదు. భూదిగంతములనుండి ఆవిరిలేవజేయు వాడా, వాన కురియునట్లు మెరుపు పుట్టించు వాడా, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. కావలి వారు వుదయము కొరకు కనిపెట్టుకొనుటకంటే యెక్కువగా స్వేఛ్చ కొరకు నా ప్రాణము కనిపెట్టుచున్నది. నాకొక వేకువను ప్రసాదింపుము. ఆరు బయటి సముద్రము రెక్కలు కట్టుకొని నా చెంత వాలునట్లు చేయుము. తల్లివలె వేచి యున్న నా ప్రియురాలి వోర్మిని యింకనూ పరీక్షింపకుము. నా చేతులకున్న సంకెళ్లను త్రెంచివేయుటకై  నేను నిన్ను పది తంత్రుల సితారతో కీర్తించెదను. నీ నామమును ఘనపరిచెదను.

అయ్యా! నా ప్రార్థననాలకించినందులకు నీకు స్తోత్రములు.....స్తోత్రములు.

వొకానొక సంవత్సరం 
చిత్తూరు జైలు 

Wednesday, January 25, 2012

మరణం లేని చీకటి లోకి

వొక పురాతన కాలం నుంచి 
యిక్కడే జీవిస్తున్నాను 
శాపగ్రస్త రాక్షసుడివలె 
భూమిని భుజాల మీద మోస్తున్నాను 
నా నీడ మీదే నడుస్తున్నాను 
అనేక మరణాల పొడవునా 
తీవ్ర వాంఛ వొకటే బతుకుతోంది 
అనేక భ్రమల మధ్య 
దుఖం వొకటే నిలుస్తోంది
అనేక మనిషి పొరల మధ్య
జంతువొకటే కదులుతోంది
నా దుఖపు కోరికల్ని ఆకాశం ఆవహించాక
సమస్త నీతుల్నీ ధిక్కరించి 
సమస్త  జన్మల్నీ నిరాకరించి 
నా తొలి తల్లి గర్భం లోకి నేను 
తిరోగమిస్తాను


                                                                                             ---25.01.2012
                                                                                                 ఉదయం 9.15